ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 7:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దయనీయ స్థితిలో ఐడీబీఐని అప్పగించారు.. ఇప్పుడు కాల్స్‌ ఒత్తిడిలేదు: రాహుల్‌కు మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్‌

అర్జున్ సమాచారం:
ఐడీబీఐ బ్యాంక్‌లో మెజార్టీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌కు విక్రయించే ప్రతిపాదన రాజకీయంగా దుమారం రేపుతోంది. మెజార్టీ వాటా విక్రయాన్ని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ   వ్యతిరేకించారు. బ్యాంక్ ఉద్యోగులకు తన మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
‘‘కాంగ్రెస్ హయాంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యాపారవేత్తలకు అప్పులు ఇచ్చేలా పబ్లిక్ సెక్టార్‌ బ్యాంక్‌లపై ఒత్తిడి తెచ్చారు. మొండి బకాయిలతో ఐడీబీఐ బ్యాంక్  తీవ్ర నష్టాలపాలైంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో అది దయనీయస్థితిలో ఉంది. అలాంటి దశలో మాకు అప్పగించారు. మోదీ ప్రభుత్వం ముందుచూపు విధానాలు దానిని మళ్లీ గాడినపడేశాయి. రూ.25వేల కోట్లకుపైగా మూలధనాన్ని సమీకరించి, బ్యాంక్‌ను పూర్వస్థితికి తీసుకు వచ్చింది. దాంతో బ్యాంక్‌ ఇప్పుడు వృద్ధి పథంలో అడుగులు వేసింది. ఐడీబీఐ బ్యాంక్‌ పునర్వ్యవస్థీకరణలో నియమ నిబంధనలన్నింటినీ పాటించాం. ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాం. కాంగ్రెస్ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థలో పలుకుబడి ఉన్నవారికి, సామాన్య పౌరులకు భిన్నమైన నియమావళి ఉండేది. ఆ శకం ముగిసింది. ఇప్పుడు సామాన్య ప్రజలకు రుణాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కాల్స్‌తో రుణాలు ఇవ్వాలని ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి లేదు’’ అని ఆర్థిక మంత్రి సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఐడీబీఐ బ్యాంక్‌  లో ప్రభుత్వం, ఎల్‌ఐసీకి ఉన్న 60.72% మెజారిటీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ సంస్థకు రూ.52,878 కోట్లకు విక్రయించేందుకు కేంద్ర మంత్రి మండలి అక్టోబరు 14న ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను ఐడీబీఐ అధికారులు, ఉద్యోగుల ఐక్య వేదిక (యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఐడీబీఐ ఆఫీసర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌) వ్యతిరేకిస్తోంది. ఈ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని, పార్లమెంటరీ పర్యవేక్షణలో సమగ్ర సమీక్ష జరపాలని డిమాండు చేసింది. మరోవైపు, లాభాల బాటలో ఉన్న బ్యాంకును అమ్మడం సరికాదని రాహుల్ కేంద్రంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో బ్యాంకులు దేశ అభివృద్ధి కోసం ఏర్పాటైతే.. మోదీ హయాంలో అవి అమ్ముడవుతున్నాయని విమర్శించారు.